MUST READ

బగ్గిడి గోపాల్ సినిమా ఆడియో విడుదల


బగ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై దర్శకుడు అర్జున్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం బగ్గిడి గోపాల్. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. బగ్గిడి గోపాల్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా...సుమన్, కవిత, గీతాంజలి, రమాకాంత్, చందన, తేజా రెడ్డి, అమిత్ కపూర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జయసూర్య సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. మాజీ ముఖ్యమంత్రి, మాజీ తమిళనాడు గవర్నర్ రోశయ్య, నటి జమున, ఏపీసీసీ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి, మాజీ మంత్రి మారెప్ప తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆడియో సీడీని రోశయ్య విడుదల చేసి చిత్ర యూనిట్ కు అందజేశారు. అనంతరం బగ్గిడి గోపాల్ మాట్లాడుతూ...నేను స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనలేదు, అంబేద్కర్, నెహ్రూను కాదు. మామూలుగా అయితే నా బయోపిక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నా జీవితంలో యువతకు స్ఫూర్తినిచ్చే ఎన్నో అంశాలున్నాయి. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన నేను ఒక బస్సు కండక్టర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగాను. డబ్బు కోసం రాజీపడకుండా ఎమ్మెల్యే పదవిని త్యాగం చేశాను. నన్ను ఎన్నుకున్న ప్రజల పక్షాన నిలబడ్డాను. రాజకీయాల్లో నిజాయితీగా ఉన్నాను. ఇవి కొందరికి నచ్చక నన్ను అణగదొక్కే ప్రయత్నాలు చేశారు. వాటిని ఎదుర్కొని నిలబడి ఇవాళ అనేక విద్యాసంస్థలు నెలకొల్పి ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాను. నా జీవితాన్ని కథగా రాస్తే ఎవరూ చదవరు. కాబట్టి రంగుల ప్రపంచమైన సినిమా ద్వారా ఇదంతా చెప్పాలనుకున్నాను. నేను ఎవరినీ మోసం చేయలేదు అని చెప్పాలనే నా 35 ఏళ్ల మనోవేధనకు ప్రతిరూపమే ఈ బగ్గిడి గోపాల్ చిత్రం. ఇవాళ నేను ఉన్నాను. రేపు నేను ఉండకపోవచ్చు. కానీ సినిమా చిరకాలం నిలిచిపోతుంది అనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని రూపొందించాను. సినిమాలో ఎనిమిది పాటలు బాగా వచ్చాయి. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అన్నారు. దర్శకుడు అర్జున్ కుమార్ మాట్లాడుతూ...ఒక సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం బగ్గిడి గోపాల్ గారి దగ్గరకు వెళ్లాను. ఆయన తన బయోపిక్ చేయాలనే ఆలోచన గురించి చెప్పారు. బగ్గిడి గోపాల్ గారి జీవిత కథ విన్నాక...అందులో ఓ కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు, మలుపులు ఉన్నాయనిపించింది. మీ జీవిత కథ తప్పకుండా చేద్దాం సార్ అంటూ ప్రాజెక్ట్ ప్రారంభించాం.  మేము చేసింది బయోపిక్ అయినా....కథ దారి మళ్లకుండా అన్ని వాణిజ్య అంశాలు పొందుపరిచాం. నా అభిమాన కథానాయకుడు సుమన్ గారిని డైరెక్ట్ చేయడం మర్చిపోలేని అనుభూతి. ఈ సినిమాలో నేనూ ఓ కీలక పాత్రలో నటించాను. సినిమా అంతా మన కళ్ల ముందు ఓ కథ జరిగినట్లుగా ఉంటుంది. అన్నారు. రోశయ్య, రఘువీరారెడ్డి, జమున, గీతాంజలి, సుమన్ తదితరులు చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.

 

 

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - మోహన్, ఎడిటర్ - వినోద్ అద్వయ్, స్టంట్స్ - అన్వేష్ పూరి, నిర్మాతలు - బగ్గిడి గోపాల్, బగ్గిడి నవీన్ కుమార్.

Tags : Baggidi Gopal    |   
Date published: Sunday, June 03, 2018, 08:00 PM

CommentsPallibatani Is Powered By pallibatani.com, Group of Individual Reporters With The Aim To Provide News To Regional Telangana & Andhra Pradesh People. Our Team Of Dynamic Journalists Strives To Gather Regional Data And Offers Modicum Quality In Pallibatani.Com Site. more...