MUST READ

షూటింగ్ సెట్లోనే పూర్తి కథను రవితేజ విన్నారు - నేల టిక్కెట్టు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ


సోగ్గాడే చిన్నినాయనాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకొన్నారు. రారండోయ్‌ వేడుకచూద్దాంతో ఆ విజయాన్ని  నిలబెట్టుకొన్నారు. తాజాగా రవితేజతో నేలటిక్కెట్టు తెరకెక్కించారు. ఈ నెల 25న ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా కల్యాణ్‌కృష్ణ శనివారం హైదరా బాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

 

నేలటిక్కెట్టు అనేది మాస్‌ మాటే. అయితే ఇది కేవలం ఫైట్లతో కూడిన మాసే కాదు. జనాలతో ముడిపడిన కథ. చుట్టూ జనం, మధ్యలో మనం... అని ప్రచార చిత్రంలో ఓ సంభాషణ వినిపిస్తుంది కదా! ఇక్కడ మాస్‌ అంటే జనమే. అందుకే ‘నేల టిక్కెట్టు’ అనే పేరు పెట్టాం. కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంది. స్వతహాగా నాకు ఎక్కువ మంది మధ్యలో ఉండటం ఇష్టం. ఈ కథలో ఆత్మ కూడా అదే. 

 

రవితేజలో రెండు కోణాలు కనిపిస్తాయి. ఒకటి కామెడీ కోణం, మరొకటి యాక్షన్‌ కోణం. తెరపై ఎంత సరదాగా కనిపిస్తారో, అంతే ఆవేశంగానూ కనిపించగల సమర్థుడు. ‘విక్రమార్కుడు’లోని రెండు పాత్రల్లో ఆ రెండు కోణాలూ కనిపిస్తాయి. ఆ రెండింటినీ కలిపి ఒక పాత్రలో చూపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ‘నేలటిక్కెట్టు’లోని పాత్ర. మొదట ఈ కథని వేరే కథానాయకుడిని దృష్టిలో ఉంచుకొని సిద్ధం చేసుకొన్నా. కానీ రవితేజతో సినిమా అనుకొన్నాక చాలా మార్పులు చేశాం. 

 

ఊళ్లో సినిమాలు ఎక్కువగా బెంచీలో కూర్చునే చూశా. హైదరాబాద్‌కి వచ్చాక సహాయ దర్శకుడిగా పనిచేసేటప్పుడు మొదట బాల్కనీలో, ఆ తర్వాత బెంచీలో కూర్చుని చూడటం అలవాటు చేసుకొన్నా. ఒక సినిమా చూస్తున్నప్పుడు నా పక్కనే ఒక పెద్దావిడ కూర్చున్నారు. ఏం చేస్తుంటారని అడిగితే...  మున్సిపాలిటీలో స్వీపర్‌ అన్నారు. సినిమా అయ్యాక మీకేం నచ్చిందని అడిగితే ‘నాలుగైదుసార్లు నవ్వుకొన్నాం, రెండుసార్లు ఏడుపొచ్చింది, హాయిగా ఉంది సినిమా’ అన్నారు. బాల్కనీకీ, నేల టిక్కెట్టుకీ తేడా లాజిక్‌ విషయంలో కనిపించింది. నేల టిక్కెట్టు ప్రేక్షకుడు లాజిక్‌లు పట్టించుకోడు. నచ్చిందో లేదో చెబుతాడంతే. 

రవితేజతో ఈ సినిమా కోసం చేసిన ప్రయాణం 90 రోజులే. కానీ అంతకుముందు మూడు నాలుగేళ్లుగా ఆయన్ని కలుస్తూనే ఉన్నా. చాలా రోజుల కిందటే ఈ కథ ఆయనకి చెప్పా. ఈ సినిమా పూర్తిస్థాయి కథని ఆయన నేరుగా సెట్‌కి వెళ్లాకే విన్నారు. ఒక దర్శకుడిని నమ్మితే, ఆ స్థాయిలో నమ్ముతారు. రవితేజ బయట ఎలా ఉంటారో, సెట్‌లో అలాగే ఉంటారు. తెరపై కూడా అలాగే ఉంటారు. రవితేజ సినిమాలకి కామెడీ ఊహించే వస్తారు ప్రేక్షకులు. ఈ చిత్రంలో డెబ్బైశాతం కామెడీ ఉంటుంది. పని విషయంలో రవితేజ శ్రద్ధ చూసి చాలా నేర్చుకొన్నా. నిర్మాత రామ్‌ తాళ్లూరి చొరవతోనే ఈ సినిమా ఇంత వేగంగా పూర్తయింది. 

ఇప్పుడు అందరికీ నచ్చేదే విభిన్నమైన సినిమా. ప్రత్యేకంగా ప్రయోగాలు చేయడానికి లేనిక్కడ. నాకు నచ్చిన భావోద్వేగాల్ని, ప్రేక్షకులకీ నచ్చేలా చూపించాలనుకొంటాను. నిర్మాతకి సమస్య రాదనుకొన్నప్పుడు ప్రయోగాలు చేయాలి. తదుపరి ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ చేయబోతున్నా. ఈ సినిమా విడుదలైన వెంటనే నాగార్జునని కలవబోతున్నా. ‘బంగార్రాజు’ పనులు జులై, ఆగస్టు మాసం నుంచి మొదలవుతాయి’’.

Tags : nela ticket    |    kalyan krishna    |   
Date published: Sunday, May 20, 2018, 12:04 PM

CommentsPallibatani Is Powered By pallibatani.com, Group of Individual Reporters With The Aim To Provide News To Regional Telangana & Andhra Pradesh People. Our Team Of Dynamic Journalists Strives To Gather Regional Data And Offers Modicum Quality In Pallibatani.Com Site. more...