MUST READ

రంగస్థలం మూవీ రివ్యూ

Rating :

PB Rating : 3.5/5

సుకుమార్ సినిమాల్లో లాజిక్స్ ఎక్కువ. కానీ ఈసారి కొత్తగా ట్రై చేశాడు. అదే రంగస్థలం. మనల్ని ఓ ఇరవై సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లే కథ అది. రాంచరణ్ ని కంప్లీట్ మాస్ లుక్ లోకి మార్చిన సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంతో సూపర్ బజ్ క్రియేట్ చేశాడు. చరణ్, సమంత లుక్స్ తో అదరగొట్టారు. నిర్మాతలు అద్భుతమైన ట్రైలర్ తో క్రేజ్ తీసుకొచ్చారు. మరి ఈ రంగస్థలం ఎంతవరకు మెప్పిస్తుందో చూద్దాం. 

 

కథేంటంటే....

రంగస్థలం అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు (రామ్ చరణ్) అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి (సమంత)ని ప్రేమిస్తాడు. ఆమె కూడ అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత ముప్పై ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకుతినే ప్రెసిండెంట్ ఫణీంధ్ర భూపతి (జగపతిబాబు) అక్రమాల్ని తట్టుకోలేక, ఊరి బాగు కోసం చిట్టి బాబు అన్న కుమార్ బాబు (ఆది పినిశెట్టి) అతనికి పోటీగా ప్రెసిండెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడ కష్టపడుతుంటాడు. కానీ ఆ నామినేషన్ తో చిట్టిబాబు, కుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తెలెత్తుతాయి. ఆ ఆపదలేంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపాదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడు అనేదే మిగతా కథ.

 

సమీక్ష

 

ఈ చిత్రానికి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథాంశం, అందులోని పాత్రలు. వాస్తవికతకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ, పాత్రలు సినిమాతో ప్రేక్షకుడు మమేకమయ్యేలా చేశాయి. గ్రామీణ నైపథ్యంతో తీర్చిదిద్దిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ముఖ్యంగా సెకండాఫ్ ఫ్లోని ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. అమాయకత్వం, ధైర్యం, ప్రేమ, పగ కలగలిసిన కథానాయకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అట్టే ఇమిడిపోయారు. ఈసారి ఆయన నటన చాలా సహజంగా, మెచ్చుకోదగిన విధంగా ఉంది. ఎక్కడా తడబడకుండా వినికిడి లోపం ఉన్నవాళ్లు ఎలాగైతే స్పందిస్తుంటారో అలానే స్పందిస్తూ, గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై తనలోని నటుడ్ని పూర్తిస్థాయిలో ఆవిష్కరించాడు. కీలక సన్నివేశాల్లో ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో పాటు కొన్ని పాటల్లో ఆయన వేసిన మాస్ స్టెప్స్ కూడ అలరించాయి.

 

ఇక పల్లెటూరి యువతి రామలక్ష్మిగా సమంత పెర్ఫార్మెన్స్ ముచ్చట గొలిపింది. ఆమెకు, చరణ్ కు మధ్యన నడిచే ప్రతి సన్నివేశం అందంగా, ఎంజాయ్ చేసే విధంగా ఉంది. చరణ్ అన్నయ్య కుమార్ బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటన కథలో లోతును పెంచగా, రంగమ్మత్తగా అనసూయ, ప్రతినాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో జగపతిబాబులు కథను రక్తి కట్టించే నటన కనబర్చారు. దేవి శ్రీ ప్రసాద్ తన సంగీతంతో, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అలరించగా రత్నవేలు కెమెరా మ్యాజిక్, రామకృష్ణ, మౌనికల ప్రొడక్షన్ డిజైన్ ప్రేక్షకుడ్ని కొత్త అనుభూతికి గురయ్యేలా చేశాయి.

 

సినిమా ప్రథమార్థం ఆరంభం బాగానే ఉన్నా లెంగ్త్ కొద్దిగా ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అసలు కథంతా సెకండాఫ్లోనే ఉండటంతో ఫస్టాఫ్ నుండి ఫన్, చరణ్ పెర్ఫార్మెన్స్, సెట్ వర్క్, పాత్రలు, పాటలు మినహా కథ పరంగా పెద్దగా ఎంజాయ్ చేయడానికి కంటెంట్ దొరకదు. అందులో చరణ్ పెర్ఫార్మెన్స్ బాగున్నా సెకండాఫ్ అయినంత ఎమోషనల్ గా ఫస్టాఫ్ కనెక్ట్ కాలేకపోయింది.

 

ఇక సెకండాఫ్ ఆరంభం కూడ కొంత సాగదీసిన ఫీలింగ్ కలిగింది. రన్ టైంను కొద్దిగా కుదించి ఉంటే బాగుండేది. ‘జిగేలు రాణి’ ఐటమ్ సాంగ్ కూడ ఏమంత గొప్పగా లేదు. చరణ్ వేసిన స్టెప్పులు మినహా అందులో ఉత్సాహం తెప్పించే వేరే అంశాలేవీ దొరకవు. హీరో రామ్ చరణ్ యొక్క భావోద్వేగపూరితమైన నటన బాగున్నా హీరోయిజం పరంగా స్వేచ్ఛగా ఎలివేట్ అవ్వాల్సిన చోట అవసరంలేకున్నా ఆయన పాత్రను కొంత నియంత్రించినట్టు తోస్తుంది.

 

టెక్నికల్ గా..

దర్శకుడు సుకుమార్ ప్రేక్షకులకు ఎలాంటి క్లిష్టమైన పజిల్స్ లేకుండా నేరుగా, సహజంగా ఉండేలా కథను రాసుకుని, అందులో వాస్తవికతకు దగ్గరగా ఉండే పాత్రల్ని ప్రవేశపెట్టి, ఎంతో అందంగా, హుందాగా సున్నితమైన సినిమాను తీసి ఒక దర్శకుడిగా, కథకుడిగా తన వంతు భాద్యతను పరిపూర్ణంగా నెరవేర్చి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకులకి ఒక మంచి సినిమాను చూసే అవకాశం కల్పించారు.

 

దేవి శ్రీ ప్రసాద్ తన సంగీతంతో అలరించగా సినిమాటోగ్రఫర్ రత్నవేలు తన కెమెరా పనితనంతో గోదావరి అందాలను, పాత కాలపు గ్రామీణ వాతావరణాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించి ఆకట్టుకున్నాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. డైలాగ్స్, పాటల్లో చంద్రబోస్ అందించిన సాహిత్యం మెప్పించాయి. ప్రొడక్షన్ డిజైనర్స్ రామకృష్ణ, మౌనికల పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వాళ్ళు రూపొందించిన రంగస్థలం విలేజ్ సెట్ వర్క్ రెండున్నర గంటలపాటు ప్రేక్షకుల్ని నిజంగా ‘రంగస్థలం’ అనే గ్రామ వాతావరణంలోకి తీసుకెళ్లింది. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడా వెనుకాడకుండా పెట్టిన ఖర్చు క్వాలిటీ పరంగా సినిమాను ఉన్నత స్థాయిలో నిలబెట్టింది.

 

ఫైనల్ గా..

రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ ‘రంగస్థలం’ ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడమే కాకుండా ఒక నటుడిగా ఆయన స్థాయిని కూడ రెట్టింపు చేసింది. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలని తపించే సుకుమార్ ఈ సినిమాను చాలా భిన్నంగా రూపొందించారు. కానీ ఈ సినిమాలో మాత్రం చాలా అంశాలు, పాత్రలు కొత్తగా ఉండి ఆకట్టుకున్నాయి. మంచి కథ కథనాలు, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే చిట్టిబాబు, రంగమ్మత్త, కుమార్ బాబుల పాత్రలు, రఫ్ఫాడించేలా ఉన్న రామ్ చరణ్ నటన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు కాగా కొద్దిగా ఎక్కువైన రన్ టైమ్, సెకండాఫ్ ఆరంభం కొద్దిగా సాగదీసినట్టు ఉండటం కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. మొత్తం మీద ఈ వేసవిలో అటు మాస్ ప్రేక్షకుల్ని, కుటుంబ ప్రేక్షకుల్ని ఈ చిత్రం తప్పకుండ అలరిస్తుంది.

PB Rating : 3.5/5

Tags : Rangasthalam    |   
Date published: Friday, March 30, 2018, 07:17 PM
vijay
3.5 / 5 stars
Starring:
ram charan
samantha
aadi pinishetty
jagapathi babu
Music Director: devisri prasad
Producer: mytri movie makers
Directed by: sukumar
Disclaimer:
Pallibatani.com publishes news, reviews, facts, gossips and speculations. We however exclude any expressed warranties, as to quality, accuracy, completeness, effectiveness or any of the contents including comments and feedback contained within the website and we decline any responsibility that may arise from the same

CommentsPallibatani Is Powered By pallibatani.com, Group of Individual Reporters With The Aim To Provide News To Regional Telangana & Andhra Pradesh People. Our Team Of Dynamic Journalists Strives To Gather Regional Data And Offers Modicum Quality In Pallibatani.Com Site. more...