MUST READ

సేవా సామ్రాజ్యంగా విస్తరిస్తున్న మనం సైతం.


 నటుడు, సామాజిక సేవకుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనం సైతం రోజు రోజుకూ తన సేవా సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటోంది. మనసున్న ఎంతో మంది మనం సైతంలో భాగమవుతున్నారు. తమకు వీలైనంత విరాళాలు అందిస్తున్నారు. మరోవైపు మనం సైతంను ఆశ్రయిస్తున్న ఆపన్నుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. వాటిలో అత్యవసరంలో ఉన్న వాళ్లను ఎంపిక చేసి ఆర్థిక సహాయం అందిస్తోంది మనం సైతం. అలాంటి కొంతమందికి శనివారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీవీ వినాయక్, నిర్మాత సి కళ్యాణ్, దర్శకుడు జి నాగేశ్వరరెడ్డి, శ్రీ మిత్రా చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న డ్రైవర్ యూనియన్ రాజు, లైట్ మెన్ కూతురు అనూజ, నటుడు ధమ్ కొడుకు బాబు, దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న ఉదయ్ కాంత్ తదితర పదమందికి చెక్ ల అందజేశారు. 

 

      అనంతరం కాదంబరి కిరణ్ మాట్లాడుతూ...మనల్ని మనం గౌరవంగా భావించుకున్నప్పుడే సాటి వారినీ గౌరవిస్తాం. చిత్ర పరిశ్రమలో నాకు కష్టాలు ఉన్నాయని ఎవరూ చెప్పుకోరు. అలా చెప్పుకుంటే అవకాశాలు ఇవ్వరు, దగ్గరకు రానీయరు అనే అపోహ ఉంది. అయితే నేను నా జీవితంలోని కష్టాలను పరిశ్రమలోని వాళ్లతో పంచుకున్నాను. వాళ్లు నన్ను దూరం పెట్టకుండా ఆదరించారు. అప్పుడే అనిపించింది ఈ భావన తప్పని. మనకున్న బాధలను చెప్పుకోవడంలో తప్పు లేదు. ఇవాళ మనం సైతం ఇంతింతై విస్తరిస్తోంది. ఎంతోమంది కొత్తగా సేవాభావం ఉన్నవాళ్లు భాగస్వామ్యులు అవుతున్నారు. చిరంజీవి గారితో సహా పెద్దలంతా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఇవాళ వినాయక్ గారు, కళ్యాణ్ గారు లాంటి వాళ్లు మా సంస్థను దీవించాడనికి వచ్చారు. వాళ్లకు కృతజ్ఞతలు. అన్నారు.

 

       దర్శకులు వీవీ వినాయక్ మాట్లాడుతూ....మనం సైతం కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు కాదంబరి కిరణ్ కు కృతజ్ఞతలు. ఇదొక గొప్ప కార్యక్రమం. మనం సైతం సేవను కిరణ్ తన జీవితంలో భాగం చేసుకున్నారు. కష్టాల్లో ఉన్న వాళ్ల గురించి మాట్లాడుతుంటే ఆయన కళ్లలో నీళ్లు వస్తున్నాయి. అంతగా ఇతరుల బాధను పంచుకోవడం అద్భుతం. నా వంతుగా మనం సైతంకు లక్ష రూపాయలు విరాళం అందిస్తున్నాను. మాకు వేసే దండలు, శాలువాలు కూడా వద్దు. ఆ ఖర్చు కూడా పేదల సేవకు ఉపయోగించండి. ఇలాంటి సంస్థల్లో రాజకీయాలు చేరకుండా గొప్ప సంస్థగా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నా. నా సహాయ సహకారాలు మనం సైతంకు ఎప్పుడూ ఉంటాయి. అన్నారు.

 

      నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ...పది మందితో ప్రారంభమైన మనం సైతంకు ఇప్పుడు లక్ష మంది సభ్యులయ్యారు. రేపు కోటి మంది ఇందులో చేరారని కోరుకుంటున్నాను. కోటి మందిలో పది శాతం స్పందించినా పది లక్షల రూపాయల విరాళం అందుతాయి. మన చిత్ర పరిశ్రమలో ఎన్నో కష్టాలు ఉంటాయి అవన్నీ మనకు తెలుసు. మనం ఘనంగా పుట్టిన రోజులు జరుపుకుంటాం. ఆ ఖర్చులో పదిశాతం మనం సైతంకు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నిర్మాతలుగా మేము హీరోల, దర్శకుల పుట్టిన రోజులకు వేసే ప్రకటనల్లో కొన్ని సెంటిమీటర్లు తగ్గించి ఆ సొమ్ము మనం సైతంకు ఇస్తే చాలా బాగుంటుంది. మనం సైతం దేశవ్యాప్తంగా విస్తరించాలి. అన్నారు.

 

     దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.....ప్రతి మనిషికీ బాధ ఉంటుంది. ఆ బాధ తీర్చేందుకు ఓ అండ కావాలి. అది కాదంబరి కిరణ్ రూపంలో దొరుకుతున్నందుకు సంతోషంగా ఉంది. నా వంతుగా ఏడాదికి పాతిక వేల రూపాయలు మనం సైతంకు అందిస్తాను. అన్నారు.

Tags : manam saitham    |   
Date published: Sunday, March 11, 2018, 10:30 PM

CommentsPallibatani Is Powered By pallibatani.com, Group of Individual Reporters With The Aim To Provide News To Regional Telangana & Andhra Pradesh People. Our Team Of Dynamic Journalists Strives To Gather Regional Data And Offers Modicum Quality In Pallibatani.Com Site. more...