ప్రభాస్, రాంచరణ్ ఆలోచనతో ఇండస్ట్రీ పరిస్థితి మారనుందా..?

తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్నేళ్లుగా థియేటర్ల విషయంలో కొందరు పెద్దల గుత్తాధిపత్యం నడుస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ పరిస్థితికి పూర్తిగా కొందరినే బాధ్యులుగా చెప్పడం కూడా భావ్యం కాదు. ఎందుకంటే టీవీ మాధ్యమం అనూహ్యంగా విస్తరించడంతో ప్రజలకు సినిమా ఒక్కటే వినోద సాధనం కాదన్న పరిస్థితి ఎప్పుడో వచ్చేసింది. దీనికితోడు సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి రావడం, పైరసీ భూతం వంటి పలు కారణాలతో థియేటర్లకు వచ్చే జనం సంఖ్య తగ్గి ఒక దశలో పలు థియేటర్లు మూతపడటమో లేక కమర్షియల్ కాంప్లెక్స్‌లుగా మారిపోవడమో కూడా జరిగిపోయింది. ఆ సమయంలోనే కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు రిస్క్‌కు సిద్ధపడి సొంతంగా పెట్టుబడులు పెట్టి కొన్ని థియేటర్లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
అదే సమయంలో అనూహ్యంగా పెరిగిన చిత్ర నిర్మాణవ్యయం, మరోపక్క పైరసీ భయంతో నిర్మాతలు తమ చిత్రాలను పెద్ద సంఖ్యలో థియేటర్లలో విడుదల చేసి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టి సేఫ్ జోన్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేయడం మొదలైంది. ఈ నేపథ్యంలోనే చిన్న చిత్రాలకు థియేటర్లు దొరకక, ఆ చిత్రాల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి తరచుగా తలెత్తుతూ థియేటర్ల మోనోపలీపై వివాదాలు ముసురుకుంటున్నాయి. అయితే ఇటీవలికాలంలో రాష్ట్రంలోని మధ్యస్థాయి పట్టణాల్లోను మల్టీప్లెక్స్ సంస్కృతి పెరుగుతుండటంతో నెమ్మదిగా థియేటర్ల సంఖ్య ఇప్పుడు మళ్లీ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు కలిసి చేయాలనుకుంటున్న బిజినెస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు తెర బాహుబలి హీరో ప్రభాస్ , మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలసి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ లీజ్‌కు తీసుకుంటున్నారన్న వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇది ఇండస్ట్రీకి మేలు చేసే ఆలోచనేనని పలువురు అంటున్నారు. ఎందుకంటే చిన్న సినిమాలను ఆదుకోవాలనే లక్ష్యంతోనే ఈ హీరోలిద్దరూ ఈ బిజినెస్‌లోకి దిగుతున్నారట..!
నిజానికి ముందుగా ప్రభాస్ రంగంలోకి దిగి నెల్లూరులో ఓ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే..!అంతేకాదు ప్రభాస్ కుటుంబానికి చెందిన యూవీ క్రియేషన్స్ .. చెర్రీ హీరోగా తెరకెక్కిన 'రంగస్థలం' నైజాం రైట్స్‌ను సొంతం చేసుకుంది..అలాగే కొన్ని చిన్న సినిమాలను సైతం ఈ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ ఇప్పటికే ఖైదీ నంబర్-150తో నిర్మాణ రంగంలోకి దిగాడు. అతడు కూడా పెద్ద సినిమాలే కాకుండా..మంచి కథలు దొరికినప్పుడల్లా చిన్న సినిమాలు తీయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ థియేటర్స్ బిజినెస్‌లోకి దిగుతుండడం కొంత మంది చిన్న నిర్మాతలకు వరంగా మారనుందని ఇండస్ట్రీ వర్గాలు సంబరపడుతున్నాయి.
Comments