ఎవరీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. చిరుకు ఎందుకంత ఆసక్తి..?
చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చి 39 ఏళ్లవుతుంది. మరో ఏడాదితో 40 ఏళ్లు కూడా పూర్తి చేసుకుంటాడు మెగాస్టార్. ఈ టైమ్ లో ఎన్నో వందలాది సినిమాల్లో నటించారాయన. ఇప్పుడు రీ ఎంట్రీ కూడా ఇచ్చారు. ఖైదీ నంబర్ 150లో రప్ఫాడించారు. ఇదిలా ఉంటే ఎన్నో కారెక్టర్లు చేసిన ఆయన.. ఎప్పుడూ ఓ పాత్రపై మాత్రం ప్రత్యేకమైన మోజు చూపిస్తుంటారు. అదే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఓ రకంగా చిరుకు అది డ్రీమ్ రోల్ కూడా. ఈ పాత్రపై ఇప్పుడు కాదు.. పదేళ్ల కింద ఆయన సినిమాలతో బిజీగా ఉన్నపుడే ఆసక్తిగా ఉన్నారు. రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో ఉయ్యాలవాడ చరిత్ర మరుగున పడింది. మళ్లీ ఇప్పుడు ఆయన సినిమాల్లోకి రావడంతో.. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాపై కసరత్తులు మొదలుపెట్టారు మెగాస్టార్. వీలైనంత త్వరగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రంలో నటించే పనిలో ఉన్నారు చిరంజీవి.
ఇండియాలో తొలి స్వాతంత్ర్య తిరుగుబాటు 1857లో మొదలైంది. కానీ అంతకు పదేళ్ల ముందే బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన వీరమరణంతో ముగిసింది. ఈ 8 నెలల కాలంలో బ్రిటీష్ వారిని ముప్పుతిప్పలు పెట్టి.. మూడు కాదు ముప్పై చెరువుల నీరు తాగించాడు నరసింహారెడ్డి. ఆ రోజుల్లోనే ఈయన్ని పట్టుకుంటే 1000 రూపాయల నజరానా ప్రకటించింది బ్రిటీష్ ప్రభుత్వం. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 1847, ఫిబ్రవరిలో బహిరంగంగా ఉరి తీయబడ్డాడు. ఈయన జీవితంపై సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటోన్న చిరంజీవి ఇప్పుడు సీరియస్ గా కథపై కూర్చున్నాడు.
అన్నీ కుదిర్తే 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అవుతుంది. ఇప్పటికే ఈ కథ కోసం పరుచూరి బ్రదర్స్ తోనూ డిస్కషన్స్ మొదలెట్టాడు మెగాస్టార్. సురేందర్ రెడ్డిని దర్శకుడిగా కూడా ఎంచుకున్నాడు చిరంజీవి. ఈయన జోరు చూస్తుంటే ఇదే ఏడాది సినిమా విడుదలయ్యేలా కనిపిస్తుంది. ఎంతైనా చిరు తలుచుకోవాలంతే.. ఆయన ఓకే అంటే ఇంక లేట్ ఏముంటుంది.. పట్టాలెక్కిచ్చి బండి లాగించుడే ఆలస్యం..!
Comments