ఆర్ ఎక్స్ హండ్రెడ్ ప్రీమియర్ షో రివ్యూ

 

అర్జున్ రెడ్డి సినిమా ఒక సెన్సేషన్. నేటి జనరేషన్ కు ఎపిక్ లవ్ స్టోరీ. తెలుగు సినీ జగత్తులో హద్దులు దాటి ముద్దుల వర్షం కురించిన సినిమా. అదే స్థాయిలో కామెడీనీ కూడా పండించిన సినిమా. అంతే స్థాయిలో పాటలూ ఆకట్టుకున్నాయి. దానికి మించి దర్శకుడి స్క్రీన్ ప్లే మాయాజాలం. వాటన్నిటికీ మంచి ఫ్రీగా వచ్చిన ముద్దు పబ్లిసిటీ. ఇవన్నీ తోడై అర్జున్ రెడ్డిని బ్లాక్ బస్టర్ హిట్ చేశాయి. అర్జున్ రెడ్డి తర్వాత చాలా సినిమాల్లో ముద్దు సీన్లని విచ్చలవిడిగా ట్రై చేశారు. ట్రై చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆర్ ఎక్స్ హండ్రెడ్ అనే సినిమా దాదాపు అర్జున్ రెడ్డి ని బాగా ఫాలో అయిన చిత్రం. కానీ అక్కడ హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ మధురంగా అనిపించింది. ఇక్కడ హీరోయిన్ హీరో మీద పడి పెదాల్ని కరిచేస్తుంటే… సీట్లో నుంచి వెళ్లి పోవాలనిపిస్తుంది. ముద్దు సీన్స్ పక్కన పెడితే మిగిలిన కంటెంట్ బలంగా లేకపోవడం పెద్ద మైనస్. రొటీన్ స్టోరీకి చిన్న ట్విస్ట్ పాయింట్ పెట్టుకొని ధైర్యం చేశారు. వర్మ శిష్యుడు కావడంతో వాయిలెన్స్ తో వాయగొట్టాడు. హీరోను విలన్స్ బ్యాచ్ చితక్కొట్టుడు కొడతారు. కొట్టిన చోటే కొడుతూనే ఉంటారు. ఎంతగా అంటే మనకు బోర్ కొట్టేదాకా. వాళ్ల కొట్టుడు అయిపోయాక నిద్రలేపండ్రా అని ఆడియెన్స్ అరిచేదాకా కొడుతూనే ఉంటారు. మరోవైపు ఫస్టాఫ్ లో పాట మీద పాట… పాట మీద పాట వేయడంతో…ఎన్ని సార్లని థియేటర్లోంచి బయటికి లోపలికి వెళ్లి రావాలి చెప్పండి. 

 

నిజానికి హీరో కార్తీక్ బాగా నటించాడు. హీయిన్ కూడా ముద్దుల తుఫాన్ కురిపించింది. ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఎటొచ్చీ… ఆడియెన్ ఫీల్ అయ్యే ఎమోషన్, బలమైన కథ, కథనం లేకపోవడతో దెబ్బ పడింది. దర్శకుడు స్లో నరేషన్ ఎంచుకొని పెద్ద తప్పే చేశాడు. సెకండాఫ్ స్టార్టింగ్ నుంచి దాదాపు ఓ ముప్పై నిమిషాల పాటు కథ ఎంతకూ ముందుకు కదలదు. ఫస్టాఫ్ లో సరైన సన్నివేశాలు లేక… ఫైట్లు, ముద్దు సీన్స్, పాటలతో టైం పాస్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే నీరసం మొదలైంది. 

 

అర్జున్ రెడ్డిని తలపించే విధంగా ఇంగ్లిష్ లోనే పెద్ద పెద్ద అక్షరాలతో పోస్టర్స్ వేశారు.  హీరో హీరోయిన్ ఘాటుగా ఇచ్చుకునే లిప్ కిస్ ను పోస్టర్స్ గా వేసి పబ్లిసిటీ సంపాదించారు. ట్రైలర్ లోనూ లిప్ కిస్సుల్ని హైలైట్ చేశారు. కానీ ఇవన్నీ చూపి పెద్ద మోసమే చేశారు. ఆ లివ్ కిస్ సీన్స్ కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. దర్శకుడు టెంపో మెయింటైన్ చేయలేకపోయాడు. ఇవన్నీ ఒక ఎత్తయితే… హీరో చివర్లో చనిపోవడం… సాడ్ ఎండింగ్ స్టోరీ ఎంచుకోవడం కూడా మైనస్ అనిపిస్తుంది. సినిమా ప్రారంభం నుంచి హీరోకు కనెక్ట్ అయి… ఎమోషన్ ఆడియెన్ తో పాటు ట్రావెల్ అయితే తప్ప సాడ్ ఎండిగ్ స్టోరీస్ అద్భుతం అని అనిపించవు. రియల్ స్టోరీ అని చెప్పినప్పటికీ… హీరో పెయిన్ ఆడియెన్ కు తగిలితేనే సక్సెస్. తగలకపోతే… స్క్రీన్ మీద ఎన్ని మ్యాజిక్కులు చేసినా ఫలితం ఉండదు.  ఆర్ ఎక్స్ హండ్రెడ్ లో మొదటి నుంచి సోల్ అండ్ ఫీల్ మిస్ అవ్వడంతో చివర్లో హీరో చనిపోయినా పెద్దగా ఫీలయ్యే పరిస్థితి ఉండదు. ఈ సినిమాకు మరో పెద్ద డ్రా బ్యాక్ కామెడీ లేకపోవడం. ఫస్టాఫ్ లో కామెడీ పెట్టుకునేందుకు స్కోప్ ఉంది. కానీ ఎందుకో దర్శకుడు పాటల మీద, ఫైట్స్ మీద కాన్ సన్ ట్రేట్ చేసి కామెడీ పక్కన పెట్టేశాడు. సాగతీత పాటలు, సాగతీత ఫైట్స్ తీసి కామెడీ చేసుంటే రిలాక్స్ డ్ గా అనిపించేది. అర్జున్ రెడ్డి సక్సెస్ లో కామెడీ పాత్ర చాలా కీలకం. కానీ దాన్ని ఫాలో అవుతూ రూపొందించిన ఆర్ ఎక్స్ హండ్రెడ్ కామెడీని పెడచెవిన పెట్టింది. సినిమా మొత్తం మీద రెండు మూడు సీన్స్ తప్ప పెద్ద గొప్పగా చెప్పుకునేదేం లేదు ఒకట్రెండు తప్ప డైలాగ్స్ కూడా పెద్దగా పేలలేదు. 

 

ఓవరాల్ గా… విచ్చల విడిగా ముద్దులు పెట్టేసి… పబ్లిసిటీ చేసేసుకొని బిజినెస్ చేసినప్పటికీ… కథ, కథనం, సన్నివేశాలు బలంగా లేకపోవడంతో బోర్ గా ఫీలవుతారు. అర్జున్ రెడ్డి ప్యాటర్న్ లో, ప్యాకేజీలో తెరకెక్కిన ఆర్.ఎక్స్ హండ్రెడ్ లో ఏదో ఉందని ఆశగా వెళితే నిరాశా, నిట్టూర్పులు, పక్క చూపులు తప్పవు. ట్రైలర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి మభ్య పెట్టిన చిత్రాలు చాలానే వచ్చాయి. ఆర్ ఎక్స్ హండ్రెడ్ కూడా అదే కోవలోకి వస్తుంది. 

 

Rating : PB 20/100

Leave a Reply

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange