ప్రతీ అమ్మాయి, అబ్బాయి తమని తెరపై చూసుకోగల కథ ఇది – నిహారిక

‘ఒక మనసు’ చిత్రంతో తెలుగు తెరపై కథానాయికగా మెరిసింది నిహారిక. మెగా కుటుంబం నుంచి వచ్చిన తొలి కథానాయిక కావడంతో ఆమెపై కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టుగానే ఆచి తూచి కథల్ని ఎంచుకుంటోంది. తను కథా నాయికగా నటించిన మరో చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్‌’ శనివారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నిహారిక చెప్పిన సంగతులు.
* ‘‘పెళ్లి తాలుకూ సంతోషాలకు అద్దం పట్టే కథ ‘హ్యాపీ వెడ్డింగ్‌’. పెళ్లి అనగానే అమ్మాయిలు ఎలా ఆలోచిస్తారు? ఏయే విషయాల గురించి భయపడతారు? అనే విషయాల్ని చాలా అందంగా చూపించారు. గంపెడు నటీనటులతో సందడి సందడిగా సాగిపోయే ఓ సినిమాలో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అది ‘హ్యాపీ వెడ్డింగ్‌’తో కుదిరింది. ఈ కథలో ప్రతీ పాత్ర సానుకూల దృక్పథంతోనే ఆలోచిస్తుంది. నేనేమో అక్షర అనే పాత్రలో నటించాను. తను తీసుకున్న నిర్ణయాలే ఈ కథని మలుపుతిప్పుతాయి’’
* ‘‘సినిమా షూటింగ్‌ అంతా సరదాగా గడిచిపోయింది. విడుదలకు ముందే.. ఓ చిన్న టూర్‌ వేశాం. చాలామంది మహిళల్ని కలుసుకున్నాను. వాళ్ల అభిప్రాయాలు తెలుసుకున్నాను. ప్రచారంలో భాగంగా పెళ్లికి సంబంధించిన ఓ వీడియో చేశాను. దానికి చాలా మంచి స్పందన వచ్చింది. ప్రతీ అమ్మాయి, అబ్బాయి తమని తెరపై చూసుకోగల కథ ఇది’’
* ‘‘మెగా కుటుంబం నుంచి రావడం ఓ రకంగా ఒత్తిడే. అభిమానుల అంచనాలు ఒక్కోసారి భయపెడుతుంటాయి. ‘బాగా నటిస్తే ఫర్వాలేదు. ఏమైనా తప్పు చేస్తే భూతద్దంలో పెట్టి చూస్తారు. రెండింటికీ నువ్వు సిద్ధంగా ఉండు’ అని పెదనాన్న చెప్పారు. ‘అందరి కళ్లూ నీపైనే ఉంటాయి. ప్రతీ అడుగూ జాగ్రత్తగా వేయాలి’ అని నాన్న హితబోధ చేశారు. ఆ మాటలెప్పుడూ గుర్తుపెట్టుకుంటా’’
* ‘‘పదేళ్ల పాటు కథానాయికగా కొనసాగాలన్న పెద్ద పెద్ద ఆశలేం లేవు. మహా అయితే మూడు నాలుగేళ్లు నటిస్తానేమో. ఆ తరవాత పెళ్లి చేసుకుంటా. పెళ్లయ్యాక నటించినా… అప్పుడు మరింత సెలక్టివ్‌గా ఉంటాను. చేసిన చిత్రాలు కొన్నే అయినా.. గుర్తుండిపోవాలి. వెబ్‌ సిరీస్‌లు మాత్రం కొనసాగించాలన్న ఆలోచన ఉంది. సోషల్‌ మీడియా చాలా విస్తృతమైపోతోంది. సెల్‌ఫోన్‌ పట్టుకొంటే చాలు గంటల సమయం వృథా అయిపోతోంది. అందుకే రెండు మూడేళ్ల పాటు సెల్‌ఫోన్‌కి దూరంగా ఉన్నా. ఇప్పుడు కూడా కేవలం ఇంట్లోవాళ్లతో మాట్లాడడానికే ఫోన్‌ వాడుతున్నా. ‘సైరా’లో ఓ చిన్న పాత్రలో కనిపిస్తా. పెదనాన్న సినిమాలో కనిపించడం అదృష్టం. నా వికీపీడియాలో ‘సైరా’ పేరు చూసుకోవాలన్న ఆశతోనే ఈ పాత్ర చేస్తున్నా’’

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange