‘నన్ను దోచుకుందువటే’ మూవీ రివ్యూ

సుధీర్ బాబు హీరోగా నటించిన సమ్మోహనం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి నన్ను దోచుకుందువటే చిత్రంపై అంచనాలు బాగున్నాయి. ఈ సినిమాతో సుధీర్ బాబు నిర్మాతగాను తన అద్బుష్టం పరిక్షించుకుంటున్నాడు. ఈ సినిమాతో ఆర్‌.ఎస్‌.నాయుడిని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేశారు. ఓ వైపు నిర్మాతగా, మరో వైపు హీరోగా సుధీర్ బాబు సక్సెస్ అయ్యాడో లేదో చూద్దాం.

క‌థేంటంటే: కార్తీక్ (సుధీర్‌బాబు) ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మేనేజ‌ర్‌. ప‌ని త‌ప్ప మ‌రో ప్ర‌పంచం తెలియ‌దు. ఆఫీసులో ఆయ‌నంటే అంద‌రికీ హ‌డ‌ల్‌. అమెరికాకి వెళ్లి నాన్న క‌ళ్ల‌ల్లో సంతోషం చూడాల‌న్న‌దే ఆయ‌న ఆశ‌యం. ఇంత‌లో మేన‌మామ కూతురు స‌త్య (వర్షిణి)తో పెళ్లి చేయాల‌నుకుంటారు. కానీ స‌త్య కోరిక మేర‌కు కార్తీక్ త‌న ఇంట్లో సిరి అనే అమ్మాయిని ప్రేమించాన‌ని అబ‌ద్ధం చెప్పాల్సి వ‌స్తుంది. ఆ అబ‌ద్ధాన్ని నిజమ‌ని కార్తీక్ కుటుంబ సభ్యుల్ని న‌మ్మించేందుకు సిరిగా ఆయ‌న జీవితంలోకి వచ్చిన మేఘ‌న (న‌భా న‌టేష్‌) క‌థేమిటి? ఇంట్లోవాళ్ల‌ని న‌మ్మించేందుకే క‌లిసిన కార్తీక్‌కీ, మేఘ‌న‌కీ మ‌ధ్య ఏం జ‌రిగింది? అస‌లు కార్తీక్ ఎవ‌రిని పెళ్లి చేసుకున్నాడు? అమెరికా వెళ్లాల‌న్న కార్తీక్ కోరిక తీరిందా? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మైన క‌థే ఇది. కానీ వ‌ర్త‌మాన ప‌రిస్థితుల్ని ప్ర‌తిబింబించే స‌న్నివేశాలు, పాత్ర‌ల‌తో చిత్రంలో కొత్త‌ద‌నం క‌నిపించేలా చేశారు. వాస్త‌విక‌త ఉట్టిప‌డేలా, స‌ర‌దాగా సాగేలా స‌న్నివేశాల్ని రాసుకోవ‌డం… వాటిని అంతే ప‌క‌డ్బందీగా తెర‌పై చూపించ‌డంలో ద‌ర్శ‌కుడు స‌ఫ‌ల‌మ‌య్యారు. కార్తీక్ ఆఫీస్‌లో వాతావ‌ర‌ణాన్ని, మేఘ‌న షార్ట్‌ఫిల్మ్ హంగామాని తెర‌పై చూపించిన విధానం, అక్క‌డ పండిన హాస్యంతో తొలి స‌గ‌భాగం సినిమా స‌ర‌దాగా సాగిపోతుంది. ద‌ర్శ‌కుడికి హాస్యంపై మంచి ప‌ట్టుంద‌ని చాలా స‌న్నివేశాలు చాటి చెబుతాయి. ద్వితీయార్థంలో క‌థ మ‌రింత ఆస‌క్తిక‌రంగా సాగే అవ‌కాశం ఉన్నా, మంచి డ్రామాకి చోటున్నా, ద‌ర్శ‌కుడు అటువైపు దృష్టిపెట్టలేదు. దాంతో చాలా స‌న్నివేశాలు సాగ‌దీత‌గా అనిపిస్తాయి. ప్రేక్ష‌కుడి ఊహ‌కు అందుతూ.. ఆస‌క్తిని కోల్పోయేలా చేస్తాయి. ప‌తాక స‌న్నివేశాల్లో సెంటిమెంట్ బాగా పండింది. క‌థానాయిక పాత్ర‌ని రాసుకోవ‌డంలో కొన్ని లోపాలు క‌నిపిస్తాయి. ప్ర‌థ‌మార్థంలో సుధీర్‌బాబు షార్ట్‌ఫిల్మ్‌లో న‌టించే స‌న్నివేశాలు చిత్రానికి హైలెట్‌గా నిలిచాయి.

ఎవ‌రెలా చేశారంటే: సుధీర్‌బాబు, నభా న‌టేష్‌ల అభిన‌యం ఆక‌ట్టుకుంటుంది. సినిమా అంతా కూడా వాళ్లిద్ద‌రి చుట్టూనే తిరుగుతుంది. త‌న క్ర‌మ‌శిక్ష‌ణ‌తో భ‌య‌పెట్టే బాస్‌గానూ, బ‌య‌ట కూడా సీరియ‌స్‌గా క‌నిపించే ఓ యువ‌కుడిగా సుధీర్‌బాబు చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. న‌భా న‌టేష్ ప‌క్కింటి అమ్మాయిలా క‌నిపిస్తూనే, మంచి అభిన‌యం క‌న‌బ‌రిచారు. నాజ‌ర్ తండ్రి పాత్ర‌లో క‌నిపిస్తారు. వైవా హ‌ర్ష‌, వేణు, సుద‌ర్శ‌న్‌, గిరి త‌దిత‌రులు ప‌రిధి మేర‌కు హాస్యం పండించారు. తుల‌సి క‌థానాయిక‌కి త‌ల్లిగా క‌నిపించారు. సాంకేతికంగా సినిమా ఫ‌ర్వాలేద‌నిపిస్తుందంతే. అజ‌నీష్ పాట‌లు గుర్తు పెట్టుకొనేలా మాత్రం లేవు. సురేష్ ర‌గుతు కెమెరా ప‌నిత‌నం బాగుంది. నిర్మాత‌గా కూడా సుధీర్‌బాబు తొలి ప్ర‌య‌త్నంలోనే త‌న‌కున్న అభిరుచి చాటిచెప్పారు. సినిమా స్థాయికి త‌గ్గట్టుగా నిర్మాణ విలువ‌లు క‌నిపిస్తాయి. తొలి చిత్ర‌మే అయినా ద‌ర్శ‌కుడి ప‌నితీరులో ఎంతో స్ప‌ష్ట‌త క‌నిపించింది. ముఖ్యంగా హాస్యం, సెంటిమెంట్ విష‌యంలో ఆయ‌న ప‌ట్టుంద‌ని నిరూపించారు. సున్నిత‌మైన క‌థ‌ని ఎక్క‌డా తొట్రుపాటు లేకుండా తెర‌పైకి తీసుకొచ్చారు.

చివరగా….. ఆర్.ఎస్.నాయుడు డైరెక్షన్ టాలెంట్, స్క్రీన్ ప్లే, కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్, హీరో హీరోయిన్ పెర్ ఫార్మెన్స్ సినిమాను నిలబెట్టాయి. అలాగే…. ట్రెండీ మ్యూజిక్, కలర్ ఫుల్ కెమెరా వర్క్ తో మంచి క్వాలిటీ సినిమా చూస్తున్నట్టుగా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ని కనెక్ట్ చేసే అంశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మంచి కలెక్షన్స్ రాబట్టే చిత్రంగా నన్ను దోచుకుందువటే తప్పకుండా నిలుస్తుంది.

PB Rating : 3.25/5

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange