నన్నుదోచుకుందువటే లో నవ్విస్తా…కవ్విస్తా…. – హీరోయిన్ నభా నటేష్

సుధర్ బాబు హీరోగా నటిస్తున్న నన్ను దోచుకుందువటే చిత్రంతో నభా నటేష్ తెలుగు తెరకు పరిచయమౌతోంది. ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నభాకు మంచి పేరొచ్చింది. ఈ సినిమాలో ఈమెకు చాలా మంచి పాత్ర దక్కింది. మంచి పెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుందనే కాంప్లిమెంట్స్ అందుతున్నాయి. మరి నభా నన్ను దోచుకుందువటే అనుభవాల గురించి ఏమంటుందో చూద్దాం.

ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది….
ఈ చిత్రంలో నా పేరు సిరి. చాలా హుషారైన పాత్ర. నవ్విస్తుంది. కవ్విస్తుంది. అవసరమనిపిస్తే చేతనైనంత సాయమూ చేస్తుంది. గొప్పలు చెప్పుకునే పాత్ర. తానో లఘు చిత్రాల నటినని, తనకెంతో మంది అభిమానులున్నారని.. బిల్డప్పులు ఇస్తుంటుంది. కథానాయకుడిని ప్రేమలో దింపడానికి చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి.

తెలుగు బాగా మాట్లాడుతున్నారు…
ఈ సినిమాలో సంభాషణలూ బాగానే ఉంటాయి. కన్నడమ్మాయిని కదా! నా తెలుగు మాటల్లో స్పష్టత అంతగా ఉండదు. భాష విషయంలో కసరత్తు చేశా. సెట్లోనే తెలుగు నేర్చుకున్నాను.

మీ గురించి చెప్పండి…
మాది బెంగళూరు. నాన్న వ్యాపార వేత్త. చిన్నప్పుడే నృత్యం నేర్చుకున్నా. పెయింటింగ్‌ కూడా తెలుసు. మోడలింగ్‌ అనుభవం ఉంది. 2013 ఫెమీనా మిస్‌ ఇండియా ఇంటలెక్చువల్‌గా ఎంపికయ్యా. ఆ తరవాతే సినిమాల్లో నటించాలనిపించింది. బి.ఇ. అవగానే ఇటువైపు వచ్చేశా.

మీ తొలి చిత్రం…
నా తొలి కన్నడ సినిమా ‘వజ్రకాయ’. శివరాజ్‌కుమార్‌ కథానాయకుడు. రెండో చిత్రం ‘లీ’ కూడా కన్నడలోనే. ‘వజ్రకాయ’ చూసిన రవిబాబు నుంచి పిలుపందుకుని ‘అదుగో’ కోసం ఆడిషన్స్‌కి పిలిపించారు. అలా ఆ సినిమాలో అవకాశం వచ్చింది. అది పూర్తవ్వగానే ‘నన్ను దోచుకుందువటే’ చిత్ర బృందం నుంచి పిలుపు అందింది’’.

మీరు చేసిన సినిమాలు ఎలాంటి తృప్తినిచ్చాయి.
నేను చేసిన రెండు తెలుగు సినిమాల్లోని పాత్రలూ దేనికదే విభిన్నం. ఇక ముందూ ఇలానే సరికొత్త పాత్రలు చేయాలని వుంది. అవసరం మేరకు గ్లామర్‌గా కనిపించడానికీ సిద్ధమే. నాలుగు కాలాలు చెప్పుకునే అభినయపరమైన పాత్రల్ని చేయాలనుంది. ‘వజ్రకాయ’ కోసం గుర్రపు స్వారీ నేర్చేసుకున్నా. నాపై నాకు నమ్మకం ఎక్కువ. ఏదయినా చేయాలనుకుంటే చాలా తొందరగా నేర్చేసుకోగలను. బద్దకం కూడా ఎక్కువే. నాకు భాషా పట్టింపు లేదు’’.

హీరో సుధీర్ బాబు గారి గురించి చెప్పండి… నిర్మాత కూడా ఆయనే కదా…
సుధీర్ బాబు నిర్మాతగా ఎలా ఉంటారో చెప్పలేను. కానీ మంచి ప్రొడక్షన్ వాల్యూస్ చూపించారు. నటుడిగా నన్ను చాలా ఎంకరేజ్ చేశేవారు. తక్కువ మాట్లాడుతారు. కానీ చాలా క్లారిటీ తో ఉంటారు. నటించేందుకు మంచి స్పేస్ ఇస్తారు. ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టం…

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange