నా కెరీర్ లో… మోస్ట్ ఎమోషనల్ మూవీ జెర్సీ – హీరో నాని

* సినిమా చేస్తున్న‌ప్పుడు ఎలా అనిపించింది?
– చాలా హైగా అనిపించింది. ఏదో గొప్ప సినిమా చేస్తున్నామ‌నే ఫీలింగే వ‌చ్చింది. ఇంత‌కు ముందు కూడా చాలా ఎమోష‌న్ ఉన్న సినిమాలు చేశా. నిన్ను కోరి, ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం అవ‌న్నీ వేరే త‌ర‌హా సినిమాలు. అందులో ఏదో ఒక డిస్క‌ష‌న్ ఉంది. దీనికీ, వాటికీ తేడా ఉంది.

* స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో భీమిలి చేసి తొమ్మిదేళ్లు అవుతోంది. మ‌ధ్య‌లో ఎవ‌రూ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు రాలేదా?
– వ‌చ్చినా న‌చ్చాలి క‌దా. జోన‌ర్‌లో ఐడియాలు న‌చ్చితే స‌రిపోదు. వాటిని ఎంత బాగా ట్రీట్ చేశార‌నేది కీల‌కం. అలాంటి క‌థ‌ను నాకు గౌత‌మ్ చెప్పాడు. ఐడియాను రెండున్న‌ర గంట‌ల ఫార్ములాలో అద్భుతంగా చెప్పాడు. ఇప్పుడు న‌చ్చింది. చేస్తున్నా.

* యంగ్ ఏజ్‌లో ఫాద‌ర్‌గా న‌టించారు..
– ఏం ఇబ్బంది లేదు. న‌న్ను నిజంగా ముస‌లివాడిగా వేయ‌మ‌న్నా, ప్రాస్త‌టిక్ మేక‌ప్ వేసుకోమ‌న్నా సిద్ధంగానే ఉన్నా. న‌టుడిగా నాది కాని వ‌య‌సులో న‌టించ‌డానికి చాలా ఆనందిస్తా.

* కావాల‌నే త‌గ్గారా?
– ఈ సినిమా కోసం త‌గ్గ‌లేదు. కాక‌పోతే రిహార్సల్స్ వంటివి చేస్తుంటే త‌గ్గానంతే.

* షూటింగ్ స‌మ‌యంలోనూ చాలా దెబ్బ‌లు త‌గిలిన‌ట్టున్నాయి.
– భీమిలి క‌బ‌డీ జ‌ట్టు అప్పుడు రోజూ కాళ్లు కొట్టుకుపోయేవి. అప్పుడు మీడియాగానీ, సోష‌ల్ మీడియాగానీ ఇంత స్ట్రాంగ్‌గా లేదు. అందువల్ల ఎవ‌రికీ తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అంత భారీగా పెర‌గ‌డంతో దెబ్బ త‌గిలింది అని అనగానే… త‌గిలింద‌ట త‌గిలింద‌ట అనేది పెద్ద న్యూస్ అవుతోంది. అప్ప‌ట్లోఇంత డిస్క‌ష‌న్ లేదు.

* మీ అబ్బాయి మిమ్మ‌ల్ని జ‌డ్జి చేస్తాడా?
– ప్ర‌తి తండ్రీ ప్ర‌పంచం దృష్టిలో ఏమైనా ఫ‌ర్వాలేదు కానీ, కొడుకు దృష్టిలో మాత్రం హీరో కావాల‌నుకుంటాడు. అందుకే జెర్సీలో ఆ డైలాగ్ అంత హిట్ అయింది. మా అబ్బాయికి ఇంకా న‌న్ను జ‌డ్జి చేసే వ‌య‌సు రాలేదు.

* మిమ్మ‌ల్ని ఎవ‌రైనా ఎప్పుడైనా జ‌డ్జి చేస్తే ఇబ్బంది ప‌డ్డారా?
– లేదండీ. ల‌క్కీగా నా సినిమాలు కొన్నిసార్లు స‌క్సెస్ కాన‌ప్పుడు కూడా నా న‌ట‌న గురించి ఎవ‌రూ ఎప్పుడూ ఒక మాట అన‌లేదు. కాక‌పోతే రెండు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేసేట‌ప్పుడు `నాని ఇక క‌మ‌ర్షియ‌లేనా..` అని అన్నారంతే. అది కూడా పెద్ద జ‌డ్జిమెంట్ కాద‌నుకోండి.

* స‌త్య‌రాజ్‌గారితో ప‌నిచేయ‌డం ఎలా అనిపించింది?
– ఆయ‌నతో ప‌నిచేయ‌డం పెద్ద లెర్నింగ్‌. చాలా సంద‌ర్భాల్లో ఆయ‌న‌కు చాలా చిన్న డైలాగులే ఉండేవి. ఒక‌రోజు మ‌ధ్యాహ్నం ఆయ‌న‌కు ఒక చిన్న డైలాగ్ ఉంది. ఆ విష‌యం తెలిసి మ‌దురైలో షూటింగ్ చేస్తున్న ఆయ‌న అక్క‌డి నుంచి చెన్నైకి కారులో వ‌చ్చి అక్క‌డి నుంచి ఫ్లైట్‌లో ఇక్క‌డికి వ‌చ్చారు. తీరా వ‌చ్చేస‌రికి ఇక్క‌డ షాట్ లేదు. అయినా ఆయ‌న డిస‌ప్పాయింట్ కాలేదు. నేనే కేర్‌వ్యాన్‌లోకి వెళ్లి సారీ చెప్పా. అయినా ఆయ‌న `ఇందులో ఏముంది` అని చాలా కూల్‌గా చెప్పారు. ఇన్నేళ్ల న‌ట‌నా కెరీర్‌లో ఆయ‌న అలా మాట్లాడుతుంటే విన‌డానికి చాలా సంతోషంగా, నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉన్న‌ట్టుగా అనిపించింది.

* స్టార్‌డ‌మ్ ని న‌మ్ముతారా?
– క‌చ్చితంగా. స్టార్‌డ‌మ్ మీద నాకు న‌మ్మ‌కం ఉంది. కాక‌పోతే ఇప్ప‌టిలాగా అంద‌రూ అమ్మే స్టార్‌డ‌మ్ మీద కాదు. కంటెంట్ వ‌ల్లే స్టార్‌డ‌మ్ వ‌స్తుంద‌ని న‌మ్ముతా.

* కెరీర్‌ని ప‌ర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్న‌ట్టున్నారు..
– అలాంటిదేమీ లేదు. నా వ‌ర‌కు వ‌చ్చిన వాటిలో నాకు న‌చ్చిన దాన్ని సెల‌క్ట్ చేస్తున్నా. నాకు అర్థ‌మైన రీతిలో ముందుకు సాగుతున్నా. అది నాకే తెలియ‌కుండా నా కెరీర్‌కి ఉప‌యోగ‌ప‌డుతోంది. నేనేం చేసినా నాకు ఇష్ట‌మైంది, నాకు న‌చ్చింది, నాకు అర్థ‌మైంది కాబ‌ట్టి చేస్తున్నా.

* సినిమా, సినిమాకూ మీమీద ప్రెజ‌ర్ పెర‌గ‌డం లేదా?
– సినిమా సినిమాకు ఎద‌గ‌డం అనేది నాకేమీ ప్రెజ‌ర్‌గా లేదు. ఎంసీఏ త‌ర్వాత బాగా ప్రెజ‌ర్ ఫీల‌య్యా. ఇప్పుడు లేదు. ఒక‌ప్పుడు జండాపై క‌పిరాజు, పైసా, అహ‌నా క‌ల్యాణం అన్నీ ఫ్లాపులే. ఆ స‌మ‌యంలో ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం లాంటి క‌థ‌ను అంగీక‌రించాను. నాకు న‌చ్చింది చేసుకుంటూ వెళ్లానంతే. న‌చ్చింది చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రెజ‌ర్ ఎందుకు?

* సోష‌ల్ మీడియాలో మీ గురించి ఏమైనా రాస్తున్న‌ప్పుడు ఏమ‌నిపిస్తుంది?
– ఇప్పుడు నాకు అర్థ‌మైంది ఒక్క‌టే.. వాటిని ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేదు.. అని! బిగినింగ్‌లో .నాకు ఆ విష‌యం తెలియ‌క ఫీల‌య్యేవాడిని. 1అలా అన్నారా. ఇలా అన్నారా1 అని అనుకునేవాడిని. ఇండ‌స్ట్రీలోని వాడిని కూడా కాదు కాబ‌ట్టి తెగ బాధ‌ప‌డేవాడిని. అప్పుడు ఎవ‌రైనా ఒక మాట అంటే అది నా చెవిలో ప‌డితే చాలా బాధ‌నిపించేది. ఆ త‌ర్వాత నాకు అంతా అల‌వాటైపోయింది. అలాంటి థాట్ ప్రాసెస్ ఉన్న వాడు అస‌లు బ‌త‌క‌లేడనే విష‌యం తెలిసింది. ఒక‌సారి పిల్ల జ‌మీందార్ స‌మ‌యంలో నానికి హెడ్ స్ట్రాంగ్ అని రాశారు. అప్పుడు చాలా ఫీల‌య్యా. అప్పుడు అంత ఆలోచించాల్సిన అవ‌స‌రం లేద‌న్న సంగ‌తి ఇప్పుడు అర్థ‌మ‌వుతోంది. స్టార్టింగ్‌లో ఎవ‌రైనా ఏదైనా రాస్తే అది కోపం వ‌చ్చి రాశారేమో అని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు రాయ‌డం వాళ్ల ధ‌ర్మం, మ‌నం ఇగ్నోర్ చేయ‌డం మ‌న ధ‌ర్మం అని అనుకున్నా.

* బిగ్ బాస్ వ‌ల్ల ఏం నేర్చుకున్నారు?
– నేను మ‌నం ప్ర‌పంచానికి ప‌రిచ‌యం కావ‌డం క‌న్నా, ప్ర‌పంచం మ‌న‌కు ప‌రిచ‌యం కావ‌డం ఇంపార్టెంట్‌. బిగ్ బాస్‌తో అలా నాకు ప్ర‌పంచం ప‌రిచ‌య‌మైంది.

* బిగ్ బాస్ ని అప్ప‌ట్లో బ‌ర్డ‌న్‌గా ఫీల‌య్యేవారా?
– అలాంటిదేమీ లేదు. కాక‌పోతే ఒక్కో ఎపిసోడ్ అక్క‌డ జ‌రుగుతున్న కొద్దీ ఇక్క‌డ సోష‌ల్ మీడియాలో దాని రిఫ్లెక్ష‌న్ ఉండేది. షోలో హీట్ పెరిగేకొద్దీ ఇక్క‌డ సోష‌ల్ మీడియాలో హీట్ పెరిగేది. `ఇది నా ఆఖ‌రి ఎపిసోడ్‌` అని ఎప్పుడు ట్వీట్ చేశానో, ఆ త‌ర్వాత `నాని అన్నా.. ప్లీజ్ కమ్ బ్యాక్‌` అని అడుగుతున్నారు.

*వెబ్‌సీరీస్ చూస్తారా?
– త‌ప్ప‌కుండా చూస్తాను. ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచంలో వెబ్‌సీరీస్ అనేది చాలా దూరం వెళ్తుంది. దాని భ‌విష్య‌త్తు చాలా గొప్ప‌గా ఉంటుంది. ఎప్పుడు ఏమైనా జ‌ర‌గొచ్చు. మెయిన్ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌లు అంద‌రూ సినిమా, వెబ్‌సీరీస్‌లు చేస్తున్నారు. నా ద‌గ్గ‌ర అలాంటి కంటెంట్ లేదు. ఉంటే నా ప్రొడ‌క్ష‌న్ హౌస్‌లోనూ చేస్తానేమో.

* ఇంద్ర‌గంటిగారు ఆడియో వేడుక‌లో మిమ్మ‌ల్ని స్టార్ మెటీరియ‌ల్ అని అన్న‌మాట‌…
– అష్టాచ‌మ్మా చేస్తున్న‌ప్పుడు ఇంద్ర‌గంటిగారు న‌న్ను చూసి అప్పుడు స్టార్ మెటీరియ‌ల్ అని చెప్పారు. కానీ అప్పుడు నేను న‌మ్మ‌లేదు. ఆ సినిమా చేస్తున్నంత కాలం నాకు డౌటే. ఆయ‌న‌కు నాలో ఏదో న‌చ్చింది కాబ‌ట్టి సినిమా చేశారు కానీ, ఈ సినిమాకు ఎవ‌రూ రారేమో అని అనుకునేవాడిని. కానీ తొలిరోజు నా డౌట్స్ క్లియ‌ర్ అయిపోయాయి.

* ఓవ‌ర్సీస్ మార్కెట్ వ‌ల్ల మ‌న‌కు ఎక్కువ ఎక్స్ పెరిమెంట్ చేయ‌డానికి వీల‌వుతుందా?
– ఓవ‌ర్సీస్ మార్కెట్ అనేది ఎక్స్ పెరిమెంట‌ల్ సినిమాల‌ను అప్రిషియేట్ చేసేది కాదు. వాళ్లు ప్రాప‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను బాగా ఎంజాయ్ చేస్తారు. మ‌నం చెప్పాల‌నుకున్న క‌థ‌లు క‌రెక్ట్ గా చెప్ప‌డానికి ఓవ‌ర్సీస్ మార్కెట్‌, తెలుగు మార్కెట్ ను ఎక్స్ పాండ్ చేస్తుంది.

* మీరు `అష్టాచ‌మ్మా`లో ఎలా ఉన్నారో, ఇప్ప‌టికీ అలాగే ఉన్నారే?
– లేదండీ. అప్ప‌టికీ, ఇప్ప‌టికీ చాలా మారాను. ఇప్పుడు ఇలా చూస్తుంటే తెలియ‌దు కానీ, వీడియోలో అష్టాచ‌మ్మా చూస్తేంటే మాత్రం చాలా మారాన‌ని తెలుస్తుంది.

* రెగ్యుల‌ర్ గా ఎక్స‌ర్‌సైజ్‌లు చేస్తుంటారా?
– ఆరునెల‌ల‌కు ఒక‌సారి ఎప్పుడో బ‌య‌టికి వెళ్లిన‌ప్పుడు ఎవ‌రైనా `లావైపోయావు` అని అంటే వేగంగా వ‌చ్చి వారం రోజులు జిమ్ చేస్తాను. అంతేగానీ ఆ త‌ర్వాత మానేస్తాను.

* మీరు రెమ్యూనిరేష‌న్ కూడా బాగా పెంచిన‌ట్టున్నారు?
– మీరు చెప్పండి.. ఎంత పెంచి ఉంటానో (న‌వ్వుతూ). సినిమాను బ‌ట్టి మారుతుంటుందండీ.

* మీ ద‌ర్శ‌కుడి గురించి చెప్పండి?
– చాలా జెన్యూన్ ప‌ర్స‌న్‌. ఆయ‌న్ని చూడగానే చాలా నిజాయ‌తీగా ఉన్నాడ‌ని అనిపిస్తుంది. ఈ సినిమాకు ఆయ‌న‌తో ప‌నిచేసిన‌ప్పుడు ఇంకా బాగా అర్థ‌మ‌య్యేవాడు. కొన్నిసార్లు ఆయ‌న‌లో ఇంత లోతు మ‌నిషి ఉన్నాడా అని అనిపిస్తుంది. ఈ సినిమా చూశాక ప్ర‌తి ప్రేక్ష‌కుడికి, ప్ర‌తి సీనులోనూ గౌత‌మ్ క‌నిపిస్తాడు.

* మీ నిర్మాత మీ క్లాస్‌మేటేన‌ట క‌దా?
– నా క్లాస్‌లో వంశీ ఉండేవాడు. చాలా స్మార్ట్ గా ఉండేవాడు. క్రికెట్ అంటే పిచ్చి. అప్ప‌ట్లో చాలా చ‌రిష్మా ఉండేది. ఆ త‌ర్వాత ఇండ‌స్ట్రీలో వంశీ అనే పేరుతో ఒక ప్రొడ్యూస‌ర్ ఉన్నాడ‌ని తెలుసు. ఒక‌సారి మా క్లాస్‌మేట్ క‌లిసిన‌ప్పుడు ఇండ‌స్ట్రీలో వంశీ ఉన్నాడ‌ని తెలిసింది. ఈ సినిమాకు ముందు మాట్లాడుకున్నాం. అదేంటో త‌ను మాత్రం న‌న్ను `సార్` అనిపిలుస్తూ ప్రొటోకాల్ మెయింటెయిన్ చేస్తున్నాడు. ఈ సినిమా మొత్తానికి కాస్త కంగారుగా ఎవ‌రైనా ఉన్నారా అంటే అది వంశీ మాత్ర‌మే. జెన్యూన్ ప్రొడ్యూస‌ర్‌.

* హీరోయిన్‌ను మీరే స‌జెస్ట్ చేశార‌ట క‌దా?
– ఒక‌సారి విక్ర‌మ్ వేదా పాట చూశాను. శ్ర‌ద్ధ‌ను చూడ‌గానే చాలా జెన్యూన్‌గా అనిపించింది. త‌న‌లో సారా పాత్ర‌లో ఉన్న ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా క‌నిపించాయి. సెట్లో త‌ను న‌టిస్తుంటే త‌న న‌ట‌న‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోయా. త‌న‌కు చాలా మంచి ఫ్యూచ‌ర్ ఉంది.

* సినిమాలో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ గురించి చెప్పండి?
– నాకు చిన్న‌పిల్ల‌లంటే ఇష్టం. చిన్న వాళ్లు ఎక్క‌డుంటే అక్క‌డికి వెళ్లి ఆడుకునేవాడిని. కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌లోనూ, మ‌రికొన్ని సినిమాల్లోనూ చిన్న‌పిల్ల‌లుంటారు. అలాగే నేను ఈ సినిమాలో బాబును కూడా నేనే కేర్ తీసుకోవాల‌ని అనుకున్నాను. కానీ వాడు మ‌మ్మ‌ల్ని కేర్‌ఫుల్‌గా చూసుకునేవాడు. ఇదిగో ఇంత మంది ముందు కూర్చుని ఇంద‌రు చెప్పే ప్ర‌శ్న‌ల‌ను వింటూ, స‌మాధానాలు చెబుతున్నా. కానీ అత‌ను అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు నా ద‌గ్గ‌ర ఉండేవి కావు. కొన్ని సార్లు నైట్ షూటింగ్‌లు చేసేవాళ్లం. అలాంటి స‌మ‌యాల్లో వాడి ఎన‌ర్జీని చూసి రెట్టింపు ఎన‌ర్జీతో ప‌నిచేసేవాళ్లం.

* అనిరుద్ మ్యూజిక్ గురించి చెప్పండి?
– బ్యాక్‌గ్రౌండ్ సంగీతం సినిమాకు హైలైట్ అవుతుంది. ఇప్ప‌టికే నేను చూసేశాను.విన్నాను. సినిమాను నెక్స్ట్ లెవ‌ల్‌కి తీసుకెళ్తుంది.

* నేచుర‌ల్ స్టార్ అనే టైటిల్ ఎలా అనిపిస్తోంది?
– ముందు అంద‌రూ అంటుంటే `ఎందుకు` అని అనుకునేవాడిని. ఆ త‌ర్వాత కొన్నాళ్ల‌కి వాళ్ల ప్రేమ అని అర్థ‌మైంది. నాకు ఇంట్లో న‌వీన్ అని పేరు పెడితే మా అమ్మ నానీ అని ముద్దుగా పిలిచింది. ఇప్పుడు అభిమానులు కూడా ముద్దుగా పిలుచుకుంటున్నారు. అందుకే నేచుర‌ల్ స్టార్ అని పిలిచినా నాకు ఆనందంగానే ఉంది.

* చైనాలో సినిమాను విడుద‌ల చేస్తున్నార‌ట క‌దా?
– అవునండీ. ఎప్పుడు ఏంటి అనేది చెప్తారు.

* ఓవ‌ర్సీస్ రిజ‌ల్ట్స్ ముందే తెలుస్తున్నాయి క‌దా?
– ఒక‌ప్పుడు సినిమా అంటే ఉద‌యం 11 గంట‌ల‌కు థియేట‌ర్ల‌కు వెళ్లి స‌ర‌దాగా చూసేవాళ్లం. కానీ ఇప్పుడు అలా కాదు. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో వివ‌రాలు ఎప్ప‌టిక‌ప్పుడు వ‌స్తూనే ఉన్నాయి. ఉద‌యం 8 గంట‌ల‌కు సినిమా చూసేవాళ్ల‌కు వంద ర‌కాల ఒపీనియ‌న్లు మెసేజ్‌ల రూపంలో అందుతున్నాయి. థ్రిల్లింగ్‌గా థియేట‌ర్‌కు వెళ్లి సినిమాలు చూసే ఎక్స్ పీరియ‌న్స్ లు ఈ త‌రం మిస్ అవుతోంది. అలా కాకుండా ఎలాగూ సినిమా చూడాల‌నుకున్నారు కాబ‌ట్టి, సెల్‌ఫోన్లు ఆఫ్‌చేసి థియేట‌ర్ల‌కు వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు.

Wordpress Social Share Plugin powered by Ultimatelysocial
Secured By miniOrange