నాగార్జున బాలీవుడ్ వెళ్లిపోయాడు.. నాని బిగ్ బాస్ తో బిజీ అయిపోయాడు.. మరి ఈ ఇద్దరూ కలిసి నటిస్తోన్న దేవదాసు షూటింగ్ ఎంతవరకు వచ్చింది..? అసలు ఈ చిత్రం పూర్తైందా.. లేదంటే ఇంకా ఉందా..? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం శూన్యమే. అయితే ఇప్పుడు నాగార్జున అన్నింటికీ క్లారిటీ ఇచ్చేసాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది. మరో పది రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది కూడా పూర్తి అయిపోతే దేవదాసుతో నాని, నాగార్జునకు బంధం తెగిపోయినట్లే. అశ్వినీదత్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నాడు. సినిమా అంతా కామెడీగానే ఉంటుందని.. రాజ్ కుమార్ హిరాణీ సినిమాలు చూసి ఎంతగా నవ్వుకుంటారో అంత కడుపులు చెక్కలయ్యేలా దేవదాస్ ఉంటుందని హామీ ఇస్తున్నాడు నాగార్జున.
ఈ చిత్రంలో తాను దేవ్ గా.. నాని దాస్ గా నటిస్తున్నాం అని చెప్పాడు ఈ హీరో. అంతేకాదు.. డాన్ గా నాగార్జున.. డాక్టర్ గా నాని కనిపించబోతున్నారు. ఈ సినిమా హిట్టైతే సీక్వెల్ కూడా చేస్తాం అంటున్నాడు నాగార్జున. నానితో నటించడం చాలా ఆనందంగా ఉందని.. అతడి తెలుగు తనకు చాలా ఇష్టమని చెప్పాడు ఈ మన్మథుడు. మొత్తానికి మరో పది రోజుల్లోనే దేవదాసు పూర్తి చేసుకుని మరో సినిమాతో బిజీ కానున్నట్లు వివరించాడు నాగార్జున. ఈ సినిమాలో నానికి జోడీగా లక్కీ బ్యూటీ రష్మిక.. నాగార్జునకు జోడీగా మళ్లీరావా ఫేమ్ ఆకాంక్ష సింగ్ నటిస్తున్నారు. సెప్టెంబర్ లో సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.