జనతా హోటల్ మూవీ రివ్యూ…

ఓకే బంగారం చిత్రంతో దుల్కర్ సల్మాన్ కి తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. మహానటి చిత్రంతో టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ పెరిగింది. అలాంటి దుల్కర్ నటించిన చిత్రం జనతా హోటల్. ఈ డబ్బింగ్ సినిమా తెలుగులో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. నిత్యామీనన్ హీరోయిన్ గా నటించింది. మళయాలంలో ఘనవిజయం సాధించి ఇంటర్‌నేషనల్ ఫిల్మ్‌ఫెస్ట్‌కు సెలెక్ట్ అయిన ‘ఉస్తాద్ హోటల్’ను తెలుగులో ‘జనతా హోటల్’ పేరుతో ప్రముఖ నిర్మాత సురేష్ కొండేటి విడుదల చేశారు. భారీ పబ్లిసిటీతో రిలీజ్ చేసిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎలా ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం….

కథేంటంటే…. ఫౌజీ (దుల్కర్) తండ్రి కి కొడుకంటే ప్రాణం. ముందు నలుగురు అమ్మాయిలు, కొడుకు పుట్టాలని ఎంతో ఆశిస్తాడు. అలా ఫౌజీ పుడతాడు. తన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటాడని ఆశిస్తాడు. కానీ తన తాత మాదిరిగానే చెఫ్ కావాలనుకుంటాడు. తాత వేరుగా ఉండి జనతా హోటల్ నడిపిస్తుంటాడు. ఫౌజీ తండ్రిని కాదని తాత దగ్గరికి వెళ్లి జనతా హోటల్లో పనిచేస్తాడు. సహానా (నిత్యామీనన్) ని పెళ్లి చూపుల్లో కలుస్తాడు. అలా పరిచయమౌన సహానాను ఇష్టపడతాడు. సహానాకు కూడా ఇష్టమే కానీ… చాలా కారణాలు వీరి ప్రేమకు అడ్డుతగులుతుంటాయి. జనతా హోటల్ దగ్గరలో ఉండే ఫైవ్ స్టార్ హోటల్లో ఫౌజీ చెఫ్ గా పనిచేస్తుంటాడు. అయితే… ఆ స్టార్ హోటల్ జనతా హోటల్ ను కబ్జా చేయాలని చూస్తాయి.
ఇంతకూ ఫౌజీ చెఫ్ అవ్వాలని ఎందుకనుకున్నాడు. సహానా ప్రేమను దక్కించుకున్నాడా. తాత వేరుగా ఎందుకు ఉంటాడు. జనతా హోటల్ ను స్టార్ హోటల్ ఎందుకు కబ్జా చేయాలనుకుంది. స్టార్ హోటల్ కబ్జా నుంచి ఫౌజీ జనతా హోటల్ ను ఎలా కాపాడుకున్నాడు. తండ్రి తన కొడుకు దగ్గరికి వచ్చాడా లేదా అన్నది మాత్రం థియేటర్లోనే చూడాలి.

సమీక్ష
దుల్కర్ సల్మాన్ ఈ సినిమాకు చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే చెఫ్ క్యారెక్టర్ కు సరిగ్గా సరిపోయాడు. నిజంగా చెఫ్ కళ్లముందు కనిపించినట్టుగా ఉంది. తండ్రి తో గొడవపడడం.. తాత దగ్గరికి రావడం.. తాత నేర్పించే జీవిత సత్యాలు ఎమోషనల్ గా బాగుంటాయి. ముఖ్యంగా తాత మనవడు సీన్స్ ని దర్శకుడు చాలా బాగా రాశాడు. ఇద్దరి మధ్య వచ్చేసీన్స్ భావోద్వేగంగా ఉంటాయి. చాలా సార్లు కళ్లలో నీళ్లు తిరుగుతాయి. కేవలం రిలేషన్ మీదే కాకుండా… సమాజంలో పేదల పరిస్థితి… అన్నం లేక అలమటించే వారి పరిస్థితిని కళ్లకు కట్టినట్టుగా చూపించాడు. హోటల్ ఇండస్ట్రీ లోగుట్టును కూడా చూపించాడు. వారు చేసే కపట నాటకాలు బాగా చూపించాడు. భోజనం విలువను కూడా బాగా చెప్పాడు. తాత పాత్ర ద్వారా చాలావిషయాల గురించ చర్చించాడు దర్శకుడు. మనుషులు, మనస్తత్వాల గురించి చెప్పాడు. సహానా పాత్రలో నిత్యామీనన్ ఒదిగిపోయింది. ముస్లిం మహిళ అయినప్పటికీ తనకు నట్టినట్టుగా పబ్స్ , పార్టీల్లో పాటలు పాడుతూ… స్వేచ్ఛగా జీవించే పాత్రలో చాలా బాగా చేసింది. ఈ సినిమాలో నిత్యామీనన్ ఎనర్జీ పీక్స్ లో ఉంటుంది. పార్టీ అయిన తర్వాత ఓ లారీ డ్రైవర్ ని బురిడీ కొట్టించే సీన్స్ లో హంగామా అంతా ఇంతా కాదు. సినిమాలో ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. ప్రతీ పాత్రతో ఏదో ఓ కొత్త విషయం చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు. అందరూ చాలా బాగా చేశారు.

గోపిసుందర్ మ్యూజిక్ ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. రీ రికార్డింగ్ చాలా సన్నివేశాల్ని హైలైట్ చేసింది. ప్రతీ సీన్ ను కెమెరామెన్ బాగా చూపించాడు. బీచ్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. చాలా ప్లెజెంట్ గా ఉంటాయి. ఎస్ కె పిక్చర్స్ నిర్మాణాత్మత విలువలు బాగున్నాయి. డబ్బింగ్ సినిమా చూసిన ఫీలింగ్ అస్సలు రాదు.

ఓవరాల్ గా… జనతా హోటల్ తప్పకుండా చూడాల్సిన సినిమా. మనుషులు అంతరాలు, తరాల గురించి చక్కగా చెప్పాడు. మనసుకు హాయిగా ఉండేలా సన్నివేశాల్ని కూర్చాడు. తాత పాత్రతో జీవిత సత్యాల్ని చూపించాడు. మనుషుల మధ్య బంధాలు, సంబంధాల్ని విశదీకరించి చెప్పాడు. సో… జనతా హోటల్ టేస్ట్ అదిరింది.

PB Rating : 3.25/5

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange