‘లవర్‌’తొలి సినిమా కాబట్టి ఆత్రుతగా ఎదురు చూస్తున్నా – దిల్‌రాజు

 

దిల్‌రాజు నిర్మాణ సారథ్యంలో రూపొందిన చిత్రం ‘లవర్‌’. రాజ్‌తరుణ్‌, రిద్దికుమార్‌ జంటగా నటించారు. హర్షిత్‌ నిర్మాత. అనీష్‌కృష్ణ దర్శకుడు. శుక్రవారం చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ…

‘‘గతేడాది ఆరు చిత్రాల్ని నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. ఈసారి మరో మూడు చిత్రాలు రాబోతున్నాయి. ప్రతి ఏడాది ఆరు సినిమాలు తీయడం కష్టమే. వచ్చే ఏడాది మాత్రం మా నుంచి నాలుగుకంటే ఎక్కువ సినిమాలే వస్తాయి. చిన్న సినిమా చేయాలంటే భయమేస్తుంది. ప్రేక్షకుడిని థియేటర్‌ వరకు తీసుకురావాల్సి ఉంటుంది. ఇదివరకు ‘కేరింత’ సినిమాని తీశాం. మొదట తీసింది నచ్చలేదు. దాంతో అది పక్కనపెట్టి మళ్లీ తీశాం. విడుదలైన తర్వాత సినిమా బాగుందనే టాక్‌ వచ్చినా వసూళ్లు రాలేదు. దాంతో ప్రేక్షకుల్ని థియేటర్‌కి రప్పించడం కోసం పలు ప్రాంతాల్లో తిరిగాం. అలా చిన్న సినిమాలకి పెట్టిన డబ్బు రాబట్టుకోవడం చాలా కష్టమవుతోంది. అదే సమయాన్ని ఓ మోస్తరు పేరున్న కథానాయకుడి సినిమాకి వినియోగిస్తే ప్రేక్షకుడు థియేటర్‌కి వస్తాడు కదా. అందుకే పేరున్న కథానాయకులతో ఎక్కువగా సినిమాలు చేస్తున్నాం’’.
సొంతంగా విడుదల
‘‘అనీష్‌కృష్ణ చేసిన ‘అలా ఎలా?’ చూశాక బాగా చేశాడనిపించింది. 2016లోనే తను ‘లవర్‌’ కథ చెప్పాడు. మేం బిజీగా ఉండటంతో వెంటనే చేయలేకపోయాం. మా కుటుంబంలోని కొత్త తరమైన హర్షిత్‌ మూడేళ్లుగా సినిమా నిర్మాణంలో మాతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. తాను పూర్తి స్థాయిలో ఓ సినిమా చేయాలనే కోరిడకని బయటపెట్టడంతో అనీష్‌ సిద్ధం చేసిన పూర్తిస్తాయి స్క్రిప్టుని వినమని చెప్పా. తనకీ నచ్చడంతో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. తన అభిరుచికి తగ్గట్టుగానే సంగీతం చేయించుకొని, సాంకేతిక బృందాన్ని ఎన్నుకొని… రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా ఈ సినిమాని నిర్మించాడు. అన్ని రకాలుగా సినిమా బాగుంది. మేమే సొంతంగా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఒక అనాథ కుర్రాడి ప్రేమకథ ఇది. అనంతపురం నేపథ్యంలో సాగుతుంది. జీవితంలో తాను కుటుంబం పరంగా ఏదైతే కోల్పోయాడో, తన ప్రేమ విషయంలో అది జరగకూడదని ఓ కుర్రాడు ఏం చేశాడన్నది తెరపైనే చూడాలి. రాజ్‌తరుణ్‌, రిద్దికుమార్‌ చక్కగా నటించారు. రెండు ఫైట్లుంటాయి. హర్షిత్‌ నిర్మించిన తొలి సినిమా కాబట్టి ఫలితం గురించి ఆత్రుతగా ఎదురు చూస్తున్నా’’.

సంక్రాంతికి ‘ఎఫ్‌ 2’
‘‘మల్టీస్టారర్‌ చిత్రాలు మా సంస్థలో ఎక్కువ చేస్తుండడానికి ప్రత్యేకమైన కారణాలేమీ లేవు. కథలు అలా కుదురుతున్నాయంతే. ‘ఎఫ్‌2’తో పాటు, ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఇంద్రగంటి ప్రస్తుతం స్క్రిప్టుని సిద్ధం చేస్తున్నారు. హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో కూడా ‘దాగుడుమూతలు’ అనే చిత్రం మల్టీస్టారర్‌గా చేయాలనుకొన్నాం. అయితే కథ విషయంలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. మరి అదే చేస్తామా లేక, మరో సినిమా చేస్తామా అనేది మరో వారం తర్వాత తెలుస్తుంది. వెంకటేష్‌- వరుణ్‌తేజ్‌ కథానాయకులుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎఫ్‌2’ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’.

బాలీవుడ్‌లో ఓ చిత్రం నిర్మిస్తా!
‘‘మహేష్‌ 25వ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తొలి షెడ్యూల్‌లో భాగంగా డెహ్రాడూన్‌లో కాలేజీ నేపథ్యంలో తీసిన సన్నివేశాలు చాలా సంతృప్తినిచ్చాయి. తదుపరి హైదరాబాద్‌, గోవా, అమెరికా, యూరప్‌ల్లో చిత్రీకరణ జరుపుతాం. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అలాగే నితిన్‌ కథానాయకుడిగా నిర్మిస్తున్న ‘శ్రీనివాసకళ్యాణం’ని ఈ ఏడాది ఆగస్టు 9న, రామ్‌తో తీస్తున్న ‘హలో గురూ ప్రేమకోసమే’ అక్టోబరు 18న విడుదల చేస్తున్నాం. గల్లా అశోక్‌ కథానాయకుడిగా ఓ చిత్రంతో పాటు, మా కుటుంబం నుంచి శిరీష్‌ అబ్బాయి ఆశిష్‌ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ ‘పలుకే బంగారమాయెనా’ అనే చిత్రం చేయబోతున్నాం. 2020లో బాలీవుడ్‌లో ఓ చిత్రం నిర్మిస్తాం’’.

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange