ఏదో ఓ కొత్తదనం లేకపోతే జనాలు చూడడం లేదు – బెల్లంకొండ శ్రీనివాస్‌

 

‘అల్లుడు శీను’తో అలరించిన బెల్లంకొండ శ్రీనివాస్‌… ‘జయ జానకి నాయక’తో రూ.40 కోట్ల హీరో అయిపోయాడు. నృత్యాలు, పోరాటాలు, మాస్‌ డైలాగులు… ఇలా తన కథలో అన్నీ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. ‘సాక్ష్యం’లో అయితే వీటన్నింటితో పాటు పంచభూతాలను కూడా ఇమిడ్చేశాడు. శ్రీవాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ వారమే విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ చెప్పుకొచ్చిన ‘సాక్ష్యం’ కబుర్లు…
ఈ పంచభూతాల కథేంటి? చూస్తుంటే సోషియో ఫాంటసీ సినిమాలా అనిపిస్తోంది…
గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా మనం బతకలేం. వీటిని సాక్ష్యంగా తీసుకొని అల్లుకున్న ఓ కమర్షియల్‌ కథ ఇది. అంతే తప్ప సోషియో ఫాంటసీ కాదు. ‘ఛ… ఇలా ఎందుకు జరుగుతుందిలే’ అనిపించే ఒక్క సన్నివేశమూ ఈ కథలో ఉండదు. ‘అరె.. భలే జరిగిందే’ అనుకుంటారు. అంత మ్యాజిక్‌ ‘సాక్ష్యం’లో ఉంది.
అసలు ఈ కథ ఒప్పుకోవడానికి అంతగా ఆకర్షించిన అంశాలేంటి?
పంచభూతాల నేపథ్యంలో ఇప్పటి వరకూ ఒక్క సినిమా కూడా లేదు. బహుశా ‘సాక్ష్యం’ విడుదలైన తరవాత.. ఈ తరహా కథలు మరిన్ని వస్తాయేమో.దర్శకుడు శ్రీవాస్‌ చెప్పిన కథలో దమ్ముంది.
ఈ పాత్ర కోసం మీరు చేసిన ప్రత్యేక కసరత్తులేంటి?
ఈ కథ విన్న తరవాత మరే సినిమానీ ఒప్పుకోలేదు. యాక్షన్‌ సన్నివేశాలకు ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. దానికి తగ్గట్టుగానే దుబాయ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. ఈ సినిమాలో నేను ఓ వీడియో గేమ్‌ డెవలపర్‌గా కనిపిస్తాను. సైక్లింగ్‌కి సంబంధించిన సన్నివేశాలున్నాయి. యాక్షన్‌ సన్నివేశాల్లో డూప్‌ లేకుండా నటించాను. నాతో పీటర్‌ హెయిన్స్‌ మాస్టరు చాలా రిస్కులు చేయించారు.
నిజంగా అంత రిస్కు అవసరమా?
అవసరమేనండీ. సినిమాలో ఏదో ఓ కొత్తదనం లేకపోతే జనాలు చూడడం లేదు. ‘మగధీర’ కోసం పీటర్‌ హెయిన్స్‌ చాలా సాహసాలు చేశారు. ఆ తరవాత ఆసుపత్రిపాలయ్యారు. మూడు నెలలు కేవలం మంచి నీళ్లనే ఆహారంగా తీసుకున్నార్ట. ఇదంతా ఆయనే చెప్పారు. ‘మీరు అంత రిస్కు తీసుకున్నారు కాబట్టే ‘బాహుబలి’ లాంటి సినిమా వచ్చింది కదా.. అందుకే నేనూ కష్టపడతా’ అని ఆయనతో చెప్పా. ఇందులో అయిదు ఫైట్లున్నాయి. నీరు, నిప్పు, గాలి, నింగి, నేల… ఇలా ఒక్కో ఫైట్‌ ఒక్కో నేపథ్యంలో తెరకెక్కించారు. సినిమాకున్న సామర్థ్యం పరంగా మేం కూడా ఓ మినీ ‘బాహుబలి’ని తీశామని నమ్ముతున్నా.
సినిమా సినిమాకీ ఇలా బడ్జెట్లు పెంచుకుంటూ పోతే ఎలా అనిపించదా?
నా మార్కెట్‌ని బట్టే బడ్జెట్‌ ఉంటుందండీ. ముందు నేను ఓ నిర్మాత తనయుడ్ని. ఆయనలా నేనూ ఆలోచిస్తా. అయితే ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి పెరిగింది. డిజిటల్‌ రైట్స్‌ రూపంలో మంచి మొత్తాలే అందుతున్నాయి. శాటిలైట్‌కీ మంచి రేట్లు గిట్టుబాటు అవుతున్నాయి. నటుడిగా నేను కూడా ఏదో చేయాలని తపిస్తుంటాను.
‘సాక్ష్యం’ సెన్సార్‌ ఇబ్బందుల్ని ఎదుర్కొంటోందని వార్తలొస్తున్నాయి.. నిజమేనా?
మంచి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఇలాంటి ఆటంకాలు సహజమే. సెన్సార్‌ ఇబ్బందులు ఉన్నా.. వాటిని అధిగమిస్తామని నమ్మకం ఉంది. ఈ వారం ‘సాక్ష్యం’ సినిమా థియేటర్లో చూస్తారు… ఇది పక్కా.
తేజ సినిమా ఎలా ఉండబోతోంది?
చాలా మంచి కథ. నన్ను ఈ తరహా పాత్రలో చూసి తప్పకుండా ఆశ్చర్యపోతారు. తొలిరోజే పది పేజీల డైలాగ్‌ ఇచ్చారు. అయినా సరే… చెప్పేశా. ‘నీలో ఇంత మంచి నటుడున్నాడని అనుకోలేదు’ అని తేజ మెచ్చుకున్నారు.

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange