118 మూవీ రివ్యూ

కొత్త తరహా కథల కోసం ప్రయత్నించే కథానాయకుడు నందమూరి కల్యాణ్‌ రామ్‌. అప్పుడప్పుడూ కమర్షియల్‌ కథలు చేస్తున్నా… తనదైన ముద్ర వేయాలన్న తపనతో కొత్త దర్శకుల్ని, కొత్త కథల్ని ప్రోత్సహిస్తుంటాడు. ‘అతనొక్కడే’, ‘హరేరామ్‌’ లాంటి విభిన్న చిత్రాలు వచ్చాయంటే కారణం అదే. ఇప్పుడు గుహన్‌ని తెలుగులో దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘118’ అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? కల్యాణ్‌రామ్‌ బ్రాండ్‌ ఈ సినిమాలో ఏమేరకు కనిపించింది?

కథేంటంటే: గౌతమ్‌ (కల్యాణ్‌రామ్‌) ఓ జర్నలిస్ట్‌. తరచూ తనకో కల వస్తుంటుంది. ఆ కలలో ఓ అమ్మాయి (నివేదా థామస్‌) కనిపిస్తుంటుంది. కొంతమంది దుండగులు ఆమెను చంపాలనుకోవడం, ఓ కారుని లోయలోకి తోసేయడం.. ఇదీ ఆ కల. అయితే కలలో చూసిన ప్రతీ ప్రదేశం తన నిజ జీవితంలోనూ తారసపడుతుంటుంది. లోయలో కారు కూడా కనిపిస్తుంది. అలాంటప్పుడు ఆ అమ్మాయి కూడా ఉండే ఉంటుందన్నది గౌతమ్‌ గట్టి నమ్మకం. మరి ఆ నమ్మకం నిజమైందా? కలలో కనిపించిన అమ్మాయి నిజంగానే ఉందా? ఉంటే ఆమె ఎవరు? ఆమెకు ఎదురైన ఆపద ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ‘118’

ఎలా ఉందంటే: కమర్షియల్‌ చిత్రాల నడుమ ఇదో కొత్త తరహా ప్రయత్నం అనుకోవచ్చు. ఇలాంటి కథల్లో కనిపించడం కల్యాణ్‌రామ్‌కి ఇదే తొలిసారి. ఓ కల చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంటుంది. కలలో వచ్చిన ఆధారాలను బట్టి కథానాయకుడు ఓ అన్వేషణ మొదలు పెడతాడు. కథని ప్రారంభించిన విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక్కో చిక్కుముడినీ విప్పుకొంటూ గౌతమ్‌ ప్రయాణం చేయడం, ఆ ప్రయాణంలో తనకు అనుకోని ప్రమాదాలు ఎదురవ్వడం ఈ కథని మరింత రసకందాయంలో పడేస్తాయి. ప్రథమార్ధం ఎక్కడా పట్టు సడలకుండా సాగింది. తర్వాత ఏమవుతుందో? అనే ఆసక్తి కలిగించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. అనవసరమైన సన్నివేశాలు లేకుండా కేవలం కథపైనే దృష్టి పెట్టడం బాగా కలిసొచ్చింది.

ద్వితీయార్ధంలో ఈ అన్వేషణ కాస్త సాగదీతగా అనిపిస్తుంది. చుట్టూ తిరిగి మళ్లీ ఉన్న చోటికే వచ్చినట్టు.. క్లూ కోసం మళ్లీ కథానాయకుడు తనకొచ్చిన కలపైనే ఆధారపడతాడు. కలకు సంబంధించిన సన్నివేశాలన్నీ లాజిక్‌కు దూరంగా సాగుతాయి. కలలో ఓ మనిషి వెళ్లిపోవడం, అక్కడ జరిగినదంతా చూడడం.. ఇవన్నీ లాజిక్‌ లేని సంగతులే. ఆథ్య (నివేదా థామస్‌) ఫ్లాష్‌ బ్యాక్‌ కూడా రొటీన్‌గానే ఉంటుంది. అయితే మొత్తానికి దీనినో క్రైమ్‌ థ్రిల్లర్‌గా మలచడంలో దర్శకుడు విజయం సాధించాడు ‘118’కీ ఈ కథకీ ఉన్న లింకేమిటో కూడా తెరపై తెలుసుకుంటేనే బాగుంటుంది.

ఎవరెలా చేశారంటే.. కల్యాణ్‌రామ్‌ ఇదివరకెప్పుడూ చేయని పాత్రలో కనిపించాడు. తన లుక్‌ బాగుంది. సహజంగా నటించడానికి ప్రయత్నించాడు. నివేదా ఉండేది కాసేపే. కానీ, సినిమా మొత్తం ఆ పాత్ర తాలుకూ ప్రభావం ఉంటుంది. గౌతమ్‌ ప్రియురాలి పాత్రలో షాలినీ పాండే నటించింది. ఆమె స్క్రీన్‌ ప్రెజెన్స్‌ చాలా తక్కువ. ప్రభాస్‌ శీను నవ్వించే ప్రయత్నం చేస్తుంటాడు. రాజీవ్‌ కనకాల, ‘ఛమక్‌’ చంద్ర, నాజర్‌ చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు.

గుహన్‌ రాసుకున్న కథ, స్క్రీన్‌ ప్లే ఈ చిత్రానికి బలం. పట్టు సడలని కథనంతో ఆసక్తి రేకెత్తించాడు. కాకపోతే.. లాజిక్కుల్ని వదిలేసి ఈ సినిమా చూడాలి. ఒకే ఒక్క పాట ఉంది. నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకుంటుంది. మాటల్లో ఛమక్కులు ఎక్కడా కనిపించలేదు. గుహన్‌ స్వతహాగా కెమెరామెన్‌ కాబట్టి, ఆ విభాగానికీ మంచి మార్కులు పడిపోతాయి.

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange